కలం, నిర్మల్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు (Anganwadi Workers) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా AITUC జిల్లా అధ్యక్షుడు భూక్య రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
హెల్త్ కార్డులు, రూ.25 లక్షల బీమా, రూ.10 వేల పెన్షన్ కల్పించాలని, బీఎల్ఓ విధుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, టీఏ, డీఏ బకాయిలు విడుదల చేయడంతో పాటు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించాన్నారు. 2023 సమ్మె కాలం కేసులు ఎత్తివేసి, గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి వనమాల, రమా పద్మ, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, పాల్గొన్నారు.

