స్మశాన వాటిక వద్ద గంజాయి పార్టీ.. అడ్డంగా దొరికిన యువకులు

కలం, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా దమ్మపేట మండలంలో గుట్టురట్టయింది. ఏకంగా ఆర్లపెంట గ్రామ శివారులోని స్మశాన వాటికను అడ్డాగా చేసుకుని గంజాయి సేవిస్తున్న (Drugs Party) యువకుల ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఎస్పీ బి. రోహిత్ రాజు, ఆదేశాలు, పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్ సూచనల మేరకు దమ్మపేట పోలీసులు (Dammapeta Police) ఈ దాడులు నిర్వహించినట్లు ఆదివారం మీడియాకు వెల్లడించారు.

శనివారం ​దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై బి. రాజేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆర్లపెంట శివారులోని స్మశాన వాటిక వద్ద అనుమానాస్పదంగా గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా, యూరిన్ డ్రగ్ టెస్ట్‌లో ‘టిహెచ్సి’ (THC) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ​

అనంతరం పోలీసులు చేపట్టిన విచారణలో లంకాలపల్లికి చెందిన పొట్ట సాయికుమార్ @ సాయి, నాగుపల్లికి చెందిన లవుడియా చైతన్యల వద్ద గంజాయి ఉన్నట్లు తేలింది. వారి వద్ద నుంచి మొత్తం పావు కిలో గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ. 12,500 ఉంటుందని అంచనా వేశారు.

​ఈ కేసులో గంజాయి సేవించిన ఆరుగురితో పాటు, గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను పోలీసులు దమ్మపేట కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు గంజాయి సేవించిన ఆరుగురు యువకులను పునరావాసం కోసం డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించగా, గంజాయి కలిగి ఉన్న ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. గంజాయి సరఫరా విక్రయాల నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ​

యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఈ వ్యసనం ఆరోగ్యానికి, బంగారు భవిష్యత్తుకు పూర్తిగా హానికరమని అధికారులు హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వ లేదా వినియోగానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో అశ్వారావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్సై బి. రాజేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>