దళితులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? తీన్మార్ మల్లన్న విమర్శలు

‎కలం, దేవరకొండ : బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) దళితవాడలో పర్యటించి సఫాయి కార్మికుల (Sanitation Workers) సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లెపల్లి గ్రామంలో జానయ్య ఇంటికి వెళ్లిన మల్లన్న, స్థానికంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో నేరుగా మాట్లాడారు. వారి జీవన పరిస్థితులు, వేతనాలు, పని ఒత్తిడి, అధికారుల వేధింపులు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కార్మికుల కష్టాలను విన్న మల్లన్న వెంటనే స్థానిక ఎంపీడీవోకు ఫోన్ చేసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా జానయ్య ఇంట్లో టిఫిన్ చేసిన మల్లన్న ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. సఫాయి కార్మికుల దుస్థితిపై మల్లన్న మాట్లాడుతూ.. ‘‘మోరీలు ఎత్తిపోసే కాడ, చెత్త ఊడ్చే కాడ EWS కోట ఎందుకు ఉండదు? రెడ్లు, వెలమలు అసెంబ్లీలో కూర్చుంటే.. మా వర్గాల బిడ్డలు మాత్రం మోరీలు ఎత్తిపోసే పనులే చేయాలా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు లేకపోవడం బాధాకరమన్నారు. నెలకు కేవలం రూ.5 వేల వేతనంతో పనిచేస్తున్న తాము కుటుంబాలను ఎలా పోషించుకోవాలని సఫాయి కార్మికులు మల్లన్న ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితుల్లో చాలీచాలని వేతనాలతో జీవనం సాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు ఎలాంటి బీమా సౌకర్యం లేదని, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ కనీస భద్రత కల్పించడం లేదని తెలిపారు. అధికారులు తమతో గొడ్డుచాకిరీ చేయిస్తున్నారని, ఒక్క పూట విధులకు హాజరుకాకపోయినా రెండు పూటల వేతనం కోత విధిస్తున్నారని, అధికారుల నుంచి వేధింపులు పెరుగుతున్నప్పటికీ కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.

చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి?

‎గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌ను మల్లన్న ప్రస్తావించారు. దళితుల అభ్యున్నతి కోసం అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో దళితుల సంక్షేమం గురించి మాట్లాడే పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేశాయని,దళితులకు అసైన్డ్ భూముల పట్టాలు ఇస్తామని చెప్పిన పాలకులు, ఉన్న పట్టాలను సైతం లాక్కున్నారని మండిపడ్డారు.

పారిశుద్ధ్య కార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్న మల్లన్న, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే బీసీ ప్రభుత్వంలో సఫాయి కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని చెప్పారు. సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు, బీమా, ఉద్యోగ భద్రత వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావడమే తమ బీసీ రాజ్యాధికార యాత్ర లక్ష్యమని మల్లన్న స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>