కలం, తెలంగాణ బ్యూరో : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా ఏఐసీసీ తీసుకున్న ‘ఛలో ఢిల్లీ’, ‘సుప్రీంకోర్టు మార్చ్’ లాంటివి రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. ఇప్పుడు ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ వరకు నవంబరు 1న తలపెట్టిన ర్యాలీ (Delhi Rally ) సైతం అదే తరహా ఇబ్బందుల్ని తెచ్చిపెట్టింది. రాష్ట్రం నుంచి కనీసంగా 15 వేల మందిని ఢిల్లీకి తరలించేలా ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ ప్లాన్ చేసుకున్నారు. ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే యావరేజ్‌గా వారి నియోజకవర్గం నుంచి 120 మందిని ఢిల్లీకి పంపుతున్నారు.
తొలుత ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించాలని అనుకున్నా.. రైల్వే అధికారులు నిరాకరించడంతో ఫ్లైట్ల ద్వారా తరలించాల్సి వస్తున్నది. సగటున రానుపోను టికెట్ ధర రూ. 40 వేలుగా ఉండడంతో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యాన్ని (హోటళ్లలో) కల్పించడం ఎమ్మెల్యేలకు ఊహించని తీరులో ఆర్థిక భారంగా మారింది. ఒక్కో ఎమ్మెల్యే కనీసం రూ. 30 లక్షల వరకు ఖర్చు చేయక తప్పడంలేదు. ఒక్కసారిగా ఇంత భారీ ఖర్చు నెత్తిమీద పడడం వారికి ఇబ్బందిగా మారింది. బయటకు చెప్పుకోలేక లోలోపల దిగమింగుకోలేక బాధపడుతున్నారు.
ఎమ్మెల్యేలకు కత్తిమీద సాము
స్పెషల్ రైళ్ల (Special Trains) ద్వారా అనుచరులను తరలించాలని భావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రైల్వే శాఖ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రత్యేక కోచ్‌లు, స్పెషల్ ట్రెయిన్స్ ఇవ్వలేమని రైల్వే అధికారులు తేల్చేశారు. దీనికి నిరసనగా కొందరు కాంగ్రెస్ లీడర్లు సికింద్రాబాద్ లోని రైల్ నిలయం ముందు మెరుపు ధర్నా చేశారు. మరోవైపు ఎమ్మెల్యేలు వారి అనుచరుల కోసం వోల్వో బస్సుల్లో పంపాలని అనుకున్నా ప్రయాణానికి పట్టే సమయం, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. మరో ప్రత్యామ్నాయం లేక ఫ్లైట్ టికెట్లను బుక్ చేయాల్సి వచ్చింది.
ఎమ్మెల్యేలంతా కలిసి ఒక స్పెషల్ ఫ్లైట్‌లో ఈ నెల 31న ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజున వేర్వేరు ఫ్లైట్లలో ఎమ్మెల్యేల అనుచరులు వెళ్లనున్నారు. వీరికి ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించడం కూడా ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారింది. నవంబరు 1న భారీ ర్యాలీ కోసం అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ లీడర్లు వెళ్తుండడంతో ఢిల్లీ హోటళ్లలో రూమ్‌లు దొరకడం గగనంగా మారింది. అదే రోజు రాత్రికి వీరంతా తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
Also Read : డేటా సెంటర్ల దాహం.. సర్కార్ ముందు కొత్త సవాళ్లు!
Follow Us On: X(Twitter)

