కలం, మహబూబ్నగర్ బ్యూరో: ప్రజలకు వైద్య సేవలు అందించే నేషనల్ హెల్త్ మిషన్ వైద్య సిబ్బంది (NHM Employees) వెట్టిచాకిరి చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డిలు అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద గత 16 రోజులుగా ఎన్హెచ్ఎం సిబ్బంది కొనసాగిస్తున్న నిరాహార దీక్ష శిబిరానికి వారు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇంట్లో బాసన్లు తోమే వారికి 15 వేల రూపాయలు ఇస్తున్నామని, కానీ ఎన్హెచ్ఎం వైద్య సిబ్బందికి కేవలం పదివేల రూపాయలతోనే జీవితాలు నెట్టుకొస్తున్నారని, అయినా ప్రభుత్వం కనికరం లేకుండా ప్రవర్తిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలతో ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు హెల్త్ కార్డు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టే వైద్య సిబ్బంది వారికి అనారోగ్యం అయితే పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికీ 16 రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఎన్హెచ్ఎం సిబ్బందిని చర్చలకు పిలవకపోవడం శోచనీయమన్నారు.

