కలం, యాదగిరిగుట్ట : ఓటు హక్కు పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనే లక్ష్యంగా నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ ఛలో ఢిల్లీ (Delhi Chalo) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఏఐసీసీ పిలుపు మేరకు భువనగిరిలోని వివేరా హోటల్లో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయనుంది.
ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో జరుగుతున్న ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ కార్యక్రమాన్ని (Delhi Chalo) విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమీకరించాలని నాయకులు నిర్ణయించారు.

