ధాన్యం ఎగుమతుల్లో జాప్యం.. రైతులకు తప్పని తిప్పలు!

కలం, సూర్యాపేట : సూర్యాపేట (Suryapet) వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం వరదలా వచ్చి పడింది. తమ పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు భారీగా ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించడంతో మార్కెట్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ పచ్చటి ధాన్యపు రాశులతో నిండిపోయాయి. సూర్యాపేట మార్కెట్‌కు ఒకేసారి భారీగా రైతులు తరలిరావడంతో ప్రధాన రహదారిపై తీవ్ర రాకపోకల అంతరాయం ఏర్పడింది. మార్కెట్ బయట సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు వరుస కట్టాయి. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయి, తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది.

ఒకవైపు మార్కెట్‌లోకి భారీగా ధాన్యం వస్తుండగా, మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో, దిక్కుతోచని మార్కెట్ కమిటీ అధికారులు హఠాత్తుగా మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ యార్డులోకి అనుమతించకపోవడం.. మరోవైపు మార్కెట్‌కు సెలవు ప్రకటించడంతో సుమారు 600 ట్రాక్టర్లలో వచ్చిన రైతులు మార్కెట్ వెలుపలే రోడ్లపై పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది.

రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే.. ఇప్పుడు రోడ్డు పక్కన కాపలా కాయాల్సి వస్తోందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వాతావరణంలో మార్పులు వస్తే ధాన్యం తడిసి ముద్దవుతుందేమోనన్న భయాందోళనలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ఎగుమతులను వేగవంతం చేసి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పునఃప్రారంభించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>