కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రతిపక్ష ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మద్దతుగా నిలిచారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆత్మార్పణ వ్యాఖ్యలపై హరీశ్ స్పందించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బలిదానాలు వద్దు.. అందరం కలిసి డిమాండ్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు. మంగళవారం ప్రజ్ఞాపూర్ లో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో హరీశ్ రావుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సహా పలువురు నేతలు వేదికను పంచుకున్నారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సమస్యలపై మాట్లాడిన హరీశ్ రావు.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆత్మార్పణ వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బిల్లుల కోసం చనిపోతానని అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. ఆత్మార్పణ చేసుకుంటేనే పనులు అవుతాయా? అని అంటున్నారు. కానీ, ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. పోరాడి బిల్లులు సాధించుకుందాం. బిల్లులు ఎలా రావో చూద్దాం’ అని హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, జడ్చర్లలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్లుల మంజూరు విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తాను చనిపోతేనే బిల్లులు వస్తాయంటే ఆత్మార్పణకు సిద్ధంగా ఉన్నాని చెప్పారు. నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణ పనుల బిల్లుల కోసం 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అనిరుధ్ రెడ్డి ఆత్మార్పణ వ్యాఖ్యలపై తాజాగా హరీశ్ రావు స్పందించిన తీరు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

