మోత్కుపల్లి కామెంట్స్.. ఆలేరులో పొలిటికల్ హీట్!

కలం, యాదగిరిగుట్ట: భవిష్యత్ లో ఆలేరులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? కొత్త పొలిటికల్ ఈక్వేషన్లకు తెరలేవనుందా? తాజాగా యాదగిరిగుట్టలో ‘అలయ్-బలయ్’ వేదికగా మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్థానికంగా తనకు ఉన్న పట్టు ఆధారంగా పొలిటికల్ బాంబులు పేల్చారనే ఆసక్తికర చర్చకు దారితీసింది.

“నా ఆశీర్వాదం ఉంటేనే.. ఎవరైనా ఎమ్మెల్యే అవుతారు” అంటూ మోత్కూపల్లి చేసిన కామెంట్స్ విస్తృతంగా చర్చకు పెట్టాయి. ప్రజాక్షేత్రంలో అభ్యర్థుల గెలుపును నిర్ణయించేది ఓటర్లే అయినా తన మద్దతు లేకుండా అది సాధ్యం కాదనే సంకేతాలు ప్రత్యర్థులకు, సొంత వర్గానికి పంపే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాల్లోనూ చర్చకు పెట్టాయి.

బండ్రు శోభారాణి బరిలోకి దిగుతారా?

వచ్చేసారి బండ్రు శోభారాణి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మోత్కుపల్లి పేర్కొనడం మరో కీలక మలుపు. ఆమె అభ్యర్థిత్వంపై ఎలాంటి స్పష్టత లేకపోయినా భవిష్యత్ లో ఆలేరులో పోటీ చేస్తారనే ఊహాగానాలకు బలం చేకూరింది. అయితే.. ఏ సెగ్మెంట్ నుంచి ఆమె బరిలోకి దిగుతారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ మంత్రి అవుతారని మోత్కుపల్లి అనడం రాజకీయవర్గాల్లో మరింత ఆసక్తిని రేపింది.

ఇది మోత్కుపల్లి వ్యక్తిగత అభిప్రా యమా.. లేక భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలపై సమాచారమా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం అద్దంకికి మంత్రి పదవి ఖరారైనట్లు ఎలాంటి అధికారిక ప్రకటనా లేనప్పటికీ, ఇలాంటి వ్యాఖ్య స్థానిక కాంగ్రెస్ నాయకత్వంలో కాకరేపింది.

ఇద్దరి మధ్య వర్గపోరు బహిర్గతం

మరోవైపు ప్రస్తుత ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వైఖరిపైనా మోత్కుపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలయ్ బలయ్ కి ఎమ్మెల్యే హాజరుకాకపోవడం, తాను ఫోన్ చేసినా స్పందించకపోవడం తప్పుపట్టారు. ‘నేను ఫోన్ చేసినా ఎత్తకపోతే.. ఇక సామాన్య ప్రజలకు ఏం అందుబాటులో ఉంటారు?’ అంటూ మోత్కుపల్లి ప్రశ్నించడం కొసమెరుపు. ఈ వ్యాఖ్యలు ఇద్దరు నేతల మధ్య పెరిగిన పోరును బహిర్గతం చేశాయి.

డబ్బు తీసుకోవడం తప్పుకాదని..

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులను ప్రజలు స్వీకరించడంలో మోత్కుపల్లి తప్పులేదన్నారు. కానీ డబ్బులు తీసుకున్నా.. ఓటు వేసేటప్పుడు అభివృద్ధికి కట్టుబడిన, సామాజిక న్యాయం కోసం పనిచేసే అభ్యర్థులకే వేయాలని పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మోత్కుపల్లి వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? ఇవి కేవలం సభలో చేసిన విమర్శలా? లేక భవిష్యత్లో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతాలా? అనే ప్రశ్నలు ఆలేరులో జోరందుకున్నాయి. మోత్కుపల్లి వ్యాఖ్యల ఆధారంగా ముందే నిర్ణయాలకు రాలేకపోయినా, ప్రస్తుతానికైతే ఆలేరు రాజకీయాల్లో పెద్ద కలకలమే సృష్టించాయని చెప్పొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>