భద్రాచలం హోటళ్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు

కలం, ఖమ్మం బ్యూరో :  భద్రాచలం పట్టణంలో ప్రజారోగ్యమే ధ్యేయంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Officials) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ. శరత్ తన బృందంతో కలిసి సోమవారం పట్టణంలోని పలు హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలతో పాటు ఆహార భద్రతా ప్రమాణాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ తనిఖీల సందర్భంగా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన ఒక దుకాణాన్ని అధికారులు తక్షణమే సీజ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ దుకాణంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదని పేర్కొంటూ సస్పెన్షన్ నోటీసు అందజేశారు. అలాగే, వంటగదులు, భోజనశాలల్లో పరిశుభ్రత లోపాలు, ఇతర ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన మూడు హోటళ్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. ఆయా హోటళ్ల యాజమాన్యాలు నిర్దేశిత సమయంలోగా లోపాలను పూర్తిగా సరిదిద్దుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

తనిఖీల్లో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాలకు సంబంధించి మొత్తం 7 నమూనాలను అధికారులు సేకరించారు. నాణ్యతపై స్పష్టత కోసం వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపేందుకు తగిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ. శరత్ మాట్లాడుతూ.. ఆహార వ్యాపారులందరూ తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించాలని సూచించారు. వ్యాపార లాభాల కంటే వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యమని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని హితవు పలికారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా భద్రాచలంలో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>