కలం, మెదక్ బ్యూరో: సిద్ధిపేట జిల్లా రాయ్‌పోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ వద్ద తమను బ్లాక్మెయిల్ చేస్తూ, పదేపదే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతోందని సదరు మహిళపై పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. గజ్వేల్ ఏసీపీ (Gajwel ACP) నర్సింహులు సోమవారం మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు.
గజ్వేల్ ఏసీపీ ఆఫీసులో హై డ్రామా
రాయ్‌పోల్ మండలం, సయ్యద్ నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ బేగం (37) అనే మహిళ సోమవారం గజ్వేల్ ఏసీపీ ఆఫీసుకు వచ్చింది. అక్కడున్న కానిస్టేబుల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అధికారులు మరో పిటిషన్ దారుడితో విచారణ జరుపుతున్నారు. దీంతో ఆ మహిళను వేచి ఉండాలని చెప్పారు. తన పిటిషన్ వదిలేసి వేరే దానిపై మాట్లాడుతున్నారనే కోపంతో సదరు మహిళ తన వద్ద దాచుకున్న పురుగుల మందు ప్యాకెట్‌ను ఒక్కసారిగా చింపి నోట్లో వేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
నిరంతరం వివాదాలు.. కేసులు
సయ్యద్ బేగానికి గత కొంతకాలంగా భర్తతో పాటు పొరుగువారితోనూ తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో భర్తపై ఫిర్యాదు చేయగా పోలీసులు 498A, 85 BNS కింద కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు (ఈ కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది). 2024లో ఆమెపై ఒక ఎక్సైజ్ కేసు (అక్రమ లిక్కర్ అమ్మకం) నమోదు కాగా, పొరుగువారితో గొడవలపై మరో మూడు కేసులు ఉన్నాయి. వారం రోజుల క్రితం పెద్దశంకరంపేటలో భర్తతో గొడవపడి రాయ్‌పోల్ పీఎస్‌లో పిటిషన్ ఇచ్చింది. పోలీసులు జీడీ (GD) ఎంట్రీ చేసి కోర్టు అనుమతి కోసం ప్రక్రియ చేపట్టారు. ఈ విషయమై ఏసీపీని కలవడానికి వచ్చి మళ్లీ ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
మూడోసారి ఆత్మహత్యాయత్నం.. పోలీసుల కేసు
సయ్యద్ బేగం ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇది మొదటిసారి కాదని పోలీసులు తెలిపారు. గతంలో కూడా రాయ్‌పోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండుసార్లు ఇలాగే బెదిరింపులకు దిగింది. గత వారంలోనే రాయ్‌పోల్ పోలీస్ స్టేషన్ వద్ద గాజు పెంకుతో గొంతు కోసుకుంటానని పోలీసులను భయభ్రాంతులకు గురిచేసిందని, తరచూ పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తూ, అధికారుల విధులకు విఘాతం కలిగిస్తూ, న్యూసెన్స్ సృష్టిస్తున్న సయ్యద్ బేగంపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, ఆమెపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

