కలం, నల్లగొండ : బి.ఫార్మసీ విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, పరిశోధనల వైపు ప్రత్యేక దృష్టి సారించాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ (MGU VC Khaja Altaf Hussain) పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయ క్యాంపస్లో నిర్వహించిన తొలి బ్యాచ్ బి.ఫార్మసీ విద్యార్థుల ప్రవేశ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కోర్సు ప్రారంభం నుంచే పరిశోధనాత్మక ఆలోచనలు పెంచుకుంటే ఔషధ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విస్తరించి ఉన్న ఉపాధి అవకాశాలను సులువుగా దక్కించుకోవచ్చని తెలిపారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పని చేసిన అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, మార్గదర్శకత్వం ఇక్కడి విద్యార్థులకు లభించడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. వ్యాక్సిన్లు, ఔషధ తయారీకి ప్రపంచ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ సమీపంలో ఎంజీయూ ఉండటం వల్ల పరిశోధనలు, క్షేత్రస్థాయి శిక్షణ, ఉద్యోగ అవకాశాల పరంగా విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉంటూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, డీన్ ఆచార్య వి.కిషన్, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వసంతలతో పాటు అధ్యాపకులు డాక్టర్ అర్చన, డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి, డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ రాంచందర్ గౌడ్, డాక్టర్ మాధురి, నూతన విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

