కలం, ఖమ్మం బ్యూరో : చరిత్ర పొత్తిళ్లలో దాగున్న ప్రాచీన బౌద్ధ వైభవానికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి (Nelakondapalli) వేదికగా సరికొత్త జీవం పోసుకుంటోంది. రాష్ట్ర చారిత్రక సంపదను ప్రపంచ పటంలో సముచిత స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర యజ్ఞంలో భాగంగా నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రం అంతర్జాతీయ వారసత్వ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని టాప్-3 బౌద్ధ క్షేత్రాల సరసన దీనిని నిలపాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నేలకొండపల్లిలో పర్యాటక సదుపాయాల కల్పన, బౌద్ధ స్థల సంరక్షణ, పునరుద్ధరణ పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి శంకుస్థాపన చేశారు.
చారిత్రక బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సుమారు 50–55 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మూడో శతాబ్దపు బౌద్ధ స్తూపం దేశంలోని అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటిగా నిలిచిందని, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని గుర్తుచేశారు. గతంలో తవ్వకాలలో లభ్యమైన పురాతన వస్తువులను స్థానికంగా భద్రపరిచే వసతులు లేక హైదరాబాద్ మ్యూజియానికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో బౌద్ధులకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ బృహత్తర బాధ్యత కోసం ప్రభుత్వం రూ.4.26 కోట్లను మంజూరు చేసింది. ఇందులో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.2.50 కోట్లతో పర్యాటకులకు అవసరమైన ఆధునిక మౌలిక వసతులు, సుందరమైన మార్గాలు, సమాచార సూచికలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు వైటీపీఎస్, తెలంగాణ జెన్కో నిధులతో రూ.1.76 కోట్లను వెచ్చించి పురాతన కట్టడాల అసలు శైలి, ప్రాధాన్యత దెబ్బతినకుండా పకడ్బందీగా పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.
ఇందులో భాగంగా కంబోడియా, థాయ్‌లాండ్‌తో పాటు మన దేశానికి చెందిన ప్రముఖ బౌద్ధ భిక్షువులు స్వయంగా రంగంలోకి దిగారు. పురావస్తు శాఖ సంచాలకులు, ప్రముఖ బౌద్ధ ధర్మ నిపుణులు శివనాగిరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఉపేంద్ర రెడ్డి, ఆంజనేయ రెడ్డి, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మయ్య తదితరులతో కూడిన నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టుకు దిశానిర్దేశం చేస్తోంది. విదేశీ భిక్షువులు, అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలతో సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి, రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో నేలకొండపల్లి రూపురేఖలను పూర్తిగా మార్చివేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ, నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రణాళిక సాకారమైతే నేలకొండపల్లి త్వరలోనే ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా వెలుగొందనుంది. సరికొత్త చరిత్ర లిఖించే ఈ అద్భుత క్షణాల కోసం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ భిక్షువులు, చరిత్రకారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

