కలం, యాదగిరిగుట్ట : పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో (Police Martyrs Week) భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం భువనగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ప్రారంభించగా, మొత్తం 223 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రజల రక్షణ, దేశ భద్రత కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటం వారికి అర్థవంతమైన నివాళి అని పేర్కొన్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర పరిస్థితుల్లో రోగులు, ప్రమాద బాధితులకు రక్తం అందించేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్మ్డ్ రిజర్వ్ అదనపు ఎస్పీ వినోద్ కుమార్, యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, భువనగిరి డీఎస్పీ రవీందర్, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ సురేష్, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, జిల్లా ట్రెజరర్ ఎం.ఏ. రహీం, డైరెక్టర్లు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

