కలం, ఖమ్మం బ్యూరో : యాసంగి సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని.. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) సూచించారు. సోమవారం రఘునాథపాలెం (Raghunadhapalem) మండలంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి పర్యటించిన ఆయన, మల్లేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం నీటితో నిండిన నల్లకుంట చెరువును సందర్శించి పూలు వేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదులకు దూరంగా ఉన్న రఘునాథపాలెం మండలంలో సాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు వెంకటాయపాలెం డీప్ కట్ నుంచి మంచుకొండ లిఫ్ట్ ద్వారా 25 చెరువులకు, అలాగే బుగ్గవాగు నుంచి మరో 11 చెరువులకు నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఈ మండలానికి మాత్రమే సాగునీటి సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయని, రాబోయే సీజన్ నుంచి బుగ్గవాగు నీటిని కూడా అందిస్తామని చెప్పారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరిగి రైతులు కూరగాయలు, తక్కువ నీటితో పండే పంటలు సాగు చేసుకోవడానికి వీలవుతుందన్నారు.
సూపర్ ఎల్‌నినో (Super El Nino) పరిస్థితుల నేపథ్యంలో కరువు ముప్పును ఎదుర్కొనేందుకు నీటిని, విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించాలని మంత్రి పిలుపునిచ్చారు. మండల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పుట్టకోట నీటి వనరులను నింపాలని అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం (Raghunadhapalem) మండలంలో మొదటి విడతలో 1,300 పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, రెండవ విడతలో మరో 1,100 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు కల్పిస్తామన్నారు. అలాగే రైతుల పొలాలకు రహదారుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.75 కోట్లు మంజూరు కాగా, త్వరలో మరో రూ.25 కోట్లు మంజూరు కానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ప్రజాప్రతినిధులు రాయల నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, ఇరిగేషన్ డీఈ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : AEE పరీక్ష తేదీలో మార్పు.. TGPSC కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

