కలం, స్పోర్ట్స్: ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. మళ్లీ తన పాత వైభవాన్ని అందుకోవాలని చూస్తోంది. గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన జట్టుకు ఇప్పుడు కొత్త కోచ్ వచ్చాడు. మాజీ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) ఐపీఎల్ 2027 నుంచి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మహేల జయవర్దనే స్థానంలో అతడిని నియమించినట్లు ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది. గత నాలుగు సీజన్లుగా జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన పొలార్డ్‌కు.. ఇప్పుడు మొత్తం జట్టును నడిపించే బాధ్యత దక్కింది.
ముంబై అభిమానుల అంచనాలను ఇటీవలి సీజన్లలో అందుకోలేకపోయామని పొలార్డ్ అంగీకరించాడు. జట్టు మళ్లీ బలమైన శక్తిగా మారాలంటే ముందుగా ఎక్కడ లోపాలున్నాయో గుర్తించాలని చెప్పాడు. గతంలో ముంబై ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే జట్టుగా ఉండేదని, అలాంటి భయంలేని ఆటను మళ్లీ తీసుకురావాలనుకుంటున్నానని తెలిపాడు. జట్టు కోసం ఆడటం, ఒత్తిడిలోనూ పోరాడటం మళ్లీ ముంబై గుర్తింపుగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
కోచ్‌గా తాను జట్టు సమావేశాలు, వ్యూహాలకే పరిమితం కాకుండా.. ప్రతి ఆటగాడితో విడిగా మాట్లాడతానని తెలిపాడు. జట్టులో ఒక్కొక్కరి పాత్ర ఏంటి? వారి బలాలు ఏమిటి? ఏ విషయంలో మెరుగుపడాలి? అనే అంశాలను అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తానన్నాడు. అలాంటి చర్చల వల్ల ఆటగాళ్ల ఆలోచనా విధానం అర్థమవుతుందని, మ్యాచ్ ప్రణాళికలు రూపొందించడం సులభమవుతుందని చెప్పాడు. అంతేకాకుండా ముంబై జట్టులో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. వారి సామర్థ్యానికి తగినట్లు ఆడేందుకు మానసిక ఒత్తిడి తగ్గించడం కూడా కోచ్‌గా తన బాధ్యతేనని పొలార్డ్ తెలిపాడు.
మ్యాచ్ రోజు మాత్రమే వ్యూహాలు పన్నడం, జట్టుకు దిశా నిర్దేశం చేయడం కోచ్ పని కాదని పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు, ప్రత్యర్థిని ఎదుర్కొనే ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కొన్ని నిర్ణయాలు కెప్టెన్ చేతుల్లో ఉంటాయని, అప్పటికే జట్టు ఎంత సిద్ధంగా ఉందన్నదే కీలకమని వివరించాడు. ముంబై జట్టు సంప్రదాయంలో కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, ఒకరినొకరు గౌరవించడం తప్పనిసరి అంశాలని పొలార్డ్ పేర్కొన్నాడు. గెలిచినప్పుడు అతిగా సంబరపడకుండా, ఓడినప్పుడు నిరుత్సాహానికి లోనుకాకుండా సమతుల్యత పాటించాలని అన్నాడు. జట్టు సభ్యుల మధ్య మంచి వాతావరణం ఉండటం కూడా విజయానికి అవసరమని తెలిపాడు.
పొలార్డ్ (Kieron Pollard) ముందున్న తొలి ముఖ్యమైన పని ఆటగాళ్లను కొనసాగించే జాబితాను ఖరారు చేయడం. నవంబర్ మధ్యలో రిటెన్షన్ గడువు ఉండగా, డిసెంబర్ 16న గోవాలో వేలం జరగనుంది. ఈ ప్రక్రియలో జట్టు అవసరాలను గుర్తించి, సరైన కూర్పును సిద్ధం చేయడం కీలకం కానుంది.
Also Read : ట్రై సిరీస్‌లో అఫ్ఘాన్ పైకి.. ఇంగ్లండ్ కిందకి!
Follow Us On : WhatsApp

