కలం, స్పోర్ట్స్: ఒక్క విజయం.. ర్యాంకింగ్స్లో కీలక మార్పు. జింబాబ్వేపై ట్రై సిరీస్ ఫైనల్లో గెలిచిన ఆఫ్ఘనిస్థాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings)లో ఏడో స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో వరుస ఓటములతో ఇంగ్లండ్ ఒక స్థానం దిగజారి ఎనిమిదో ర్యాంకుకు చేరింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 169 పరుగులకే ఆలౌటైంది. రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. ఫజల్హక్ ఫరూఖీ, మహ్మద్ నబీ, బిలాల్ సామీ రెండేసి వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో ఇబ్రహీం జద్రాన్ అజేయంగా 70 పరుగులు చేశాడు. రహ్మతుల్లా గుర్బాజ్ 36, రహ్మత్ షా 43 పరుగులతో రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్ సునాయాసంగా గెలిచింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ రెండు రేటింగ్ పాయింట్లు సాధించి 94 పాయింట్లతో ఏడో స్థానానికి చేరింది. ఇంగ్లండ్ 93 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. శ్రీలంక 95 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

