కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamil Nadu)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీ (Ooty) సహా పరిసర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో పాటు భారీ వృక్షాలు నేలకూలాయి. ముఖ్యంగా బార్లియార్, కున్నూర్ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్లలో రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి రహదారులపై చెట్లు కూలిపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పలుచోట్ల కొండచరియలు, రాళ్లు రోడ్లపై పడటంతో అక్కడ నిలిపివుంచిన కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి.
ఈ వర్షాల తీవ్రత కారణంగా మెట్టుపాళయం-ఊటీ ప్రధాన రహదారిపై బార్లియార్ సమీపంలో అనూహ్యంగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక ప్రభుత్వ బస్సు కొండచరియల కింద చిక్కుకుపోవడంతో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక పోలీసులు వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్లను ఎటువంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా బయటకు తీశారు.
ప్రస్తుతం ఘాట్ రోడ్లలో పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించి మార్గాన్ని సుగమం చేసేందుకు ఎక్స్కవేటర్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీలగిరి పరిధిలో ఊటీ(Ooty) పర్వత రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్ష సూచనలు ఇంకా ఉన్నందున, కొండ ప్రాంతాలకు ప్రయాణాలు చేసే పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని .. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
Also Read : 2028 నాటికి ‘మేడ్ ఇన్ ఇండియా’ మొబైల్!
Follow Us On: Youtube

