2028 నాటికి ‘మేడ్ ఇన్ ఇండియా’ మొబైల్!

కలం, నేషనల్ డెస్క్ : ‘అక్టోబర్ 23, 2026ను నోట్ చేసుకోండి.. సరిగ్గా రెండేండ్ల తర్వాత అక్టోబర్ 23, 2028 నాటికి మన దేశంలో పూర్తిగా ఇండియా డిజైన్, స్వదేశీ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి’ అని మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో ఆయన మాట్లాడారు. సెల్​ ఫోన్ల తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ అని, అంత చిన్న పరిమాణంలో రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్, యాంటెన్నా, మెమొరీ, కెమెరా మాడ్యూల్, డిస్‌ప్లే, పవర్ మేనేజ్‌మెంట్ వంటి అన్ని విభాగాలను అమర్చడం సవాల్‌తో కూడుకున్నదని ఆయన తెలిపారు.

చెప్పింది చేసి చూపించాం

మూడేండ్ల కింద తాము భారతీయ డిజైనర్లకు మొబైల్ మదర్‌బోర్డ్ (PCB) డిజైన్ చేసే సవాల్ విసిరామని, దాన్ని స్వీకరించి ఒక భారతీయ కంపెనీ అద్భుతమైన డిజైన్‌ను రూపొందించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్​ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ కంపెనీ డిజైన్‌ను అమెరికాలో పేరొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక చేసుకున్నదని తెలిపారు. అమెరికా వినియోగదారులకు ఆ సంస్థ ఇప్పటికే 5జీ ప్లస్ మొబైల్ ఫోన్లను తయారు చేసి అందిస్తున్నదని చెప్పారు. ఇప్పుడు అదే సాంకేతికతను జోడించి, భారతీయ మేధస్సు, స్వదేశీ బ్రాండ్‌తో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే మొబైల్ ఫోన్‌ను తయారు చేస్తామని స్పష్టం చేశారు.

ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాం

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిబంధనల వల్ల తయారీ రంగం నిరుత్సాహానికి గురైందని, కానీ 2014 నుంచి మేక్ ఇన్ ఇండియా విధానం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్​ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియాలో మొబైల్స్‌తో పాటు డ్రోన్లు, క్షిపణులు, రైళ్లు, అత్యాధునిక పరికరాలను తయారు చేస్తున్నామని, ప్రస్తుతం దేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులలో ఎలక్ట్రానిక్స్ కేటగిరి మూడో స్థానంలో ఉందని తెలిపారు. త్వరలోనే అది రెండో స్థానానికి చేరుకుంటుందని అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>