కలం, ఖమ్మం బ్యూరో : చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని, కబ్జాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) హెచ్చరించారు. సుజాతనగర్ మండల పరిధిలోని సర్వారం – కోయగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రూ. 2 కోట్ల నిధులతో నిర్మించనున్న డార్మిటరీ బ్లాక్, కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
ప్రజలకు, రైతులకు జీవనాధారమైన సహజ జల వనరులు, చెరువు భూములను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దర్జాగా ఆక్రమించుకోవడం గర్హనీయమని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆక్రమణలకు గురైన చెరువుల భూములను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి సమగ్ర సర్వే నిర్వహించి సత్వరమే నివేదిక అందజేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి చెరువుకు పక్కాగా హద్దులు నిర్ణయించి, కబ్జాలను తొలగించి జల వనరులను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. చెరువుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కూడా తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి, విద్యావ్యాప్తికి పెద్దపీట వేస్తున్నామని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంకోసం కృషిచేస్తున్నామని తెలిపారు. సుజాతనగర్ మండలానికి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) మంజూరు చేయించడం జరిగిందని గుర్తుచేశారు. సర్వారం – కోయగూడెం ఆశ్రమ పాఠశాల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఆయన (MLA Kunamneni) సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ లాల్ సింగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు
Follow Us On: Youtube

