కలం, నిజామాబాద్ బ్యూరో : ఎంతో ఘన చరిత్ర కలిగిన ఇందూరు ఖిల్లా రామాలయానికి (Khilla Ramalayam) రోప్ వే మంజూరైనట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు నిర్మించిన చారిత్రాత్మక కట్టడం ఖిల్లా రామాలయం అని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి కృష్ణమాచార్యులు జైలు శిక్ష అనుభవిస్తూ “తెలంగాణ నాకోటి రతనాల వీణ ” అని రాసిన గొప్ప చరిత్ర కలిగిన ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరు కావడం సంతోషకరమన్నారు.
పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. సుమారు రూ.35 కోట్ల నిధులతో రోప్ వే నిర్మాణం కానుందని, ఇందుకోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. గతంలో పాలించిన పాలకులు రామాలయ అభివృద్ధిని మరిచారని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చారిత్రక కట్టడాలపై ప్రత్యేక దృష్టి వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే పర్వతమాల పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి ఖిల్లా రామాలయ అభివృద్ధి కోసం గతంలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
దీంతో రోప్ వే మంజూరైనట్లు ఎమ్మెల్యే (Dhanpal Suryanarayana) స్పష్టం చేశారు. కేంద్రమంత్రి నితిన్ గట్కరితోపాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఖిల్లా రామాలయ అభివృద్ధి పై అనేక సార్లు లేఖలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రోడ్లు భవనాల శాఖ అధికారులను, రోప్ వే కంపెనీ ప్రతినిధులను పంపడం సంతోషకరమన్నారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులపై కూడా అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక్కటి కూడా రాని నియోజకవర్గం ఇందూరు ఒకటేనని చెప్పారు.
సమస్యను మంత్రి పొంగిలేటి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయాలని కోరినట్లు ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. దీంతో ఇటీవల అర్బన్ లోని సౌత్ మండల అర్హులకు ఇళ్లను కేటాయించాలని గుర్తు చేశారు. అలాగే స్థలం లేని వారికి హైదరాబాద్ మాదిరిగా టవర్లు నిర్మించి ఇవ్వాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, మఠం పవన్, రాము, విజయ మల్లేష్ యాదవ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి మురళి, సుమిత్ర కిషోర్, బంటు ప్రీతి ప్రవీణ్, మహిళా మోర్చ అధ్యక్షురాలు వనిత, యువ మోర్చ అధ్యక్షుడు వంశీ, యువ మోర్చ రాష్ట్ర సహా కోశాధికారి విజయ్, ఎస్సీ మోర్చ పురుషోత్తం, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

