నిరసనల్లో ఉద్రిక్తత.. చారిత్రక భవనం దహనం!

కలం, వెబ్​ డెస్క్​ : ఫ్రాన్స్‌లోని చారిత్రాత్మక లిమోజెస్ టౌన్ హాల్ భవనం శనివారం రాత్రి అగ్నిప్రమాదం (Limoges fire)లో తీవ్రంగా దెబ్బతింది. 1883లో ప్రారంభమై 143 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన భవనాన్ని ముసుగులు ధరించిన దుండగులు తగలబెట్టారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల సమయంలో ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.

ఫ్రాన్స్ చారిత్రాత్మక కట్టడం దహనం

లిమోజెస్ నగరంలో నిరసనకారులు మొదట పోలీస్ వాహనానికి నిప్పు పెట్టి, భవనం అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత భవనంలో మంటలు రాజేశారు. క్షణాల్లో మంటలు పైకప్పు వరకు వ్యాపించడంతో ప్రసిద్ధ క్లాక్ టవర్, భవనం పైకప్పు కుప్పకూలిపోయాయి. లిమోజెస్ ప్రాంతీయ ప్రిఫెక్ట్ మోరిస్ బారేట్ మాట్లాడుతూ, భవనం అత్యధిక భాగం నాశనమైందని తెలిపారు.

హింసను ఖండించిన ఫ్రాన్స్ నాయకత్వం

ఈ ఘటన విచారకరమని, హెరిటేజ్ సంపదకు తీవ్ర నష్టమని అధికారులు పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెక్లేర్నుతో పాటు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ హింసాత్మక చర్యలను ఖండించారు. ప్రశాంతంగా జరుగుతున్న నిరసనల్లోకి కొందరు దుండగులు ప్రవేశించి ఇటువంటి దాడులు చేశారని అధికారులు వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మంటల్లో చారిత్రక సంపద

1883 జూలై 14న ప్రారంభమైన ఈ లిమోజెస్ టౌన్ హాల్ ఫ్రాన్స్ వాస్తుశిల్పానికి గొప్ప నిదర్శనంగా ఉండేది. ఇందులో ఉన్న అనేక చారిత్రక కళాఖండాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, భవనంలో సింహభాగం ధ్వంసమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>