కరెన్సీ నోట్లతో కాళరాత్రిదేవి అవతారం.. పూజలు చేసిన బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శనివారం మహాశక్తి ఆలయం (Mahashakti Temple)లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి (కాళరాత్రి) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీతో నిజ పాద దర్శన రూపంలో ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ మహాలక్ష్మీ దేవిని చూసిన భక్తులు పరవశించిపోయారు. వేలాది మంది భక్తుల రాకతో మహాశక్తి ఆలయం కిటకిటలాడుతోంది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు పూజలు నిర్వహించడంతోపాలు అమ్మవారి సేవలో తరించారు. ఆలయానికి వచ్చిన భక్తులను కలుసుకుంటూ వారితో ముచ్చటించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష్మీ సాహస్ర పారాయణం విన్పించారు. అనంతరం బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ పండితులు “శ్రీ భాగవత వైభవం” వివరిస్తూ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు.

అంతకుముందు కరీంనగర్ జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.శివకుమార్ శనివారం ఉదయం శ్రీ మహాశక్తి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఆలయంలో దాండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు.

కాళరాత్రి దేవి ఆరాధన కేవలం ఆచారాలకు పరిమితం కాదు. మనలోని భయం, అహంకారం, చెడు ఆలోచనలను జయించి సత్యం, ధర్మం, న్యాయం వైపు నడవాలని ఈ అవతారం గుర్తుచేస్తుంది. కష్టాలను చూసి వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలనే స్ఫూర్తిని అందిస్తుంది. చీకటిని తొలగించి వెలుగును నింపే శక్తిగా, భయాన్ని తొలగించి అభయమిచ్చే తల్లిగా కాళరాత్రి దేవి భక్తుల పూజలందుకోవడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>