కలం, మహబూబ్నగర్ బ్యూరో: దశాబ్ద కాలంగా పేదల ఇళ్లపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, గత ప్రభుత్వ తప్పిదాలను సవరిస్తూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తీసుకున్న నిర్ణయం 310 కుటుంబాల్లో వెలుగులు నింపింది. క్రిస్టియన్ పల్లి, ఆదర్శ్ నగర్ వాసులకు ఎట్టకేలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ట్రబుల్స్ ను తీర్చారు. లబ్ధిదారులకు పట్టాలు అందించి, పాలకుల చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైన చిక్కులు కూడా అడ్డంకి కాదని నిరూపించారు.
గత ప్రభుత్వం ఇళ్లు కట్టించినా, వాటిపై లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించడంలో విఫలమయిందన్న ఆరోపణలు వచ్చాయి.
గత 9-10 ఏళ్లుగా సర్వే నంబర్ 523లో భూమికి సంబంధించిన న్యాయపరమైన, పరిపాలనాపరమైన చిక్కులు ఉన్నాయి. గత పాలకులు ఈ సమస్యను పరిష్కరించి పేదలకు హక్కులు కల్పించడంలో తాత్సారం చేశారని, కేవలం ఇళ్లు నిర్మించి చేతులు దులుపుకున్నారని విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వస్తోంది.
ఇళ్లు ఉన్నా పట్టాలు లేకపోవడంతో లబ్ధిదారులు తమ పిల్లలకు ఆస్తిని బదిలీ చేయలేక, రుణాలు పొందలేక సతమతమయ్యారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులతో చర్చించి ఈ చిక్కుముడులను విప్పారు. ఫలితంగా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి శుక్రవారం 310 మందికి అధికారికంగా పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. దీంతో దసరా పండుగ నిజంగా వచ్చిందంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా పట్టాలు లేక సతమతమవుతున్న మా బాధలను అర్థం చేసుకొని స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పట్టా సర్టిఫికెట్లు అందించడం నిజంగా మా అదృష్టం అని లబ్ధిదారులు తెలిపారు.
లబ్ధిదారులకు కేవలం పట్టాల పంపిణీతో సరిపెట్టకుండా, ఎమ్మెల్యే భవిష్యత్ అభివృద్ధికి కూడా భరోసా కల్పించారు. మహబూబ్నగర్ నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ. 603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది నగర రూపురేఖలను మార్చే నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టాలు పొందిన ఆదర్శ్ నగర్ కాలనీలో మౌలిక వసతుల కోసం తక్షణమే రూ. 2 కోట్లు కేటాయించారు.
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని చెబుతూ, గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించడమే తమ ప్రాధాన్యత అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నపూర్ణ గార్డెన్స్లో జరిగిన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం, మహబూబ్నగర్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా, పేదలకు భరోసా కల్పించే చర్యగా నిలిచిపోనుంది.

