కలం, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో(Gambhiraopet) పోలీసుల చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై, ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘ఏక్ దం న్యూస్’ ఎడిటర్ పొత్తూరి శేఖర్, జర్నలిస్ట్ రాతిపల్లి సంపత్లను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు శనివారం పరామర్శించారు. AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల-తంగేళ్ళ కిరణ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి బాధిత జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ… సమాజానికి నిజాలను నిర్భయంగా అందించే జర్నలిస్టులపై పోలీసులు దాడికి పాల్పడటం అత్యంత దారుణమని మండిపడ్డారు. అరెస్ట్ చేసే ముందు కనీసం ముందస్తు నోటీసు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా వ్యవహరించడం చట్ట విరుద్ధమన్నారు. చట్ట పరిధి దాటి జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన గంభీరావుపేట పోలీసులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్రహింసలకు గురైన జర్నలిస్టులకు ప్రభుత్వం పూర్తి ఖర్చులతో మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.
పోలీసుల అరాచకత్వానికి గురైన జర్నలిస్టుల కుటుంబాలకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా, నిర్భయంగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని కోరారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పార్టీ నాయకులు కిట్టన్నా, ప్రవీణ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఇక్కడ కన్నీటి హారతులు.. అక్కడ జలహారతులు: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

