కలం, వెబ్ డెస్క్ : గోదావరి జలాల తరలింపుపై రాజకీయ వివాదం వేడెక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) ఆరోపణలు గుప్పించారు. గోదావరి కావేరి నదుల అనుసంధానం ముసుగులో ఏపీకి నీటిని తరలించేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
చంద్రబాబు రాసిన లేఖను కేంద్ర ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే అజెండాలో చేర్చడంపై హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం వద్ద గోదావరి కావేరి లింక్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను ఏపీకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో బనకచర్ల ప్రయత్నాలు విఫలమవ్వడంతో, ఇప్పుడు గోదావరి కావేరి పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు.
శ్రీశైలంలో నీరు ఉన్నప్పటికీ సకాలంలో మోటార్లు ఆన్ చేయలేదని హరీశ్ రావు విమర్శించారు. కల్వకుర్తి ప్రాజెక్టులో ఐదు మోటార్లు ఉన్నప్పటికీ మూడే ఆన్ చేశారని పేర్కొన్నారు. ఇరవై నాలుగు గంటలు నడపాల్సిన మోటార్లను కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకే పరిమితం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ నీటిని కోల్పోతోందని, చంద్రబాబు మాత్రం కుప్పం వరకు నీళ్లు తరలించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కన్నీటి హారతులు ఇస్తుంటే, ఏపీలో జలహారతులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

