కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ కుంభకోణం (CMR Scam) కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని పలు రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు (Vigilance Officials Raids) నిర్వహించారు. సీఎంఆర్ బియ్యం సేకరణ, నిల్వల్లో భారీస్థాయిలో అవకతవకలు జరిగాయన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి మిల్లింగ్ కోసం అప్పగించిన కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ వడ్లు మిల్లుల్లో మాయమైనట్లు విజిలెన్స్ అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. రికార్డులకు, క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో అధికారులు తీవ్రంగా పరిగణించారు.
మిల్లు యజమానుల్లో వణుకు
విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులతో జిల్లాలోని రైస్ మిల్లు (Rice Mills) యజమానుల్లో గుబులు మొదలైంది. తనిఖీలు ముమ్మరం కావడంతో చాలామంది యజమానులు అధికారులకు అందుబాటులో లేకుండా తలదాచుకున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన, ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దాడులు జిల్లాలో ప్రస్తుతం సంచలనంగా మారాయి.

