కలం, వెబ్ డెస్క్: విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి (Kanaka Durga Temple) భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు శుక్రవారం నాడు సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన రోజు కావడంతో దర్శనానికి తెల్లవారుజామున రెండు గంటల నుంచే బారులు దీరారు. ఉచిత క్యూ లైన్లలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. వినాయకుడి గుడి నుంచి కొండపై వరకు క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముందు జాగ్రత్తల్లో భాగంగా అన్ని క్యూ లైన్లను ఉచిత దర్శనం లైన్లుగా మార్చారు.
నేడు అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్ఫణ..
సీఎం చంద్రబాబు ఈ రోజు కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయంత్రం 4.30 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఏటా దసరా ఉత్సవాల సమయంలో ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. శరన్నవరాత్రి ఉత్సవాలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఘాట్ల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుండటంతో అక్కడ కూడా విపరీతమైన రద్దీ నెలకొంది.

