కలం, నిజామాబాద్ బ్యూరో : మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం మిషన్ భగిరథ (Mission Bhagiratha) ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం అమ్రాబాద్ తండాను కలెక్టర్ గురువారం సందర్శించారు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంలో పలు తండాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఇదివరకు అమ్రాబాద్ తండా సహా సుమారు 11 నివాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పైప్ లైన్లు ఏర్పాటు చేయలేదు.
దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతాలకు మిషన్ భగీరథ జలాలు అందించేందుకు వీలుగా అనువైన పరిస్థితులను పరిశీలించేందుకు కలెక్టర్ క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. తాగునీటి అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పూర్తిగా బోరుబావుల పైనే ఆధారపడి జీవనాలు వెళ్ళదీస్తున్నామని ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని నివాస ప్రాంతాలకు రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా అనుకూలమైన ప్రదేశంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించాలని సూచించారు.
నిర్దేశిత ప్రాంతాలకు తాగునీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చి జల్ జీవన్ మిషన్ కింద కవర్ అయ్యేలా చూడాలన్నారు. కాగా, ఎల్ నినో ప్రభావం వల్ల ఆశించిన రీతిలో వర్షాలు కురవక నీటి నిల్వలు అంతంతమాత్రంగానే అందుబాటులో ఉన్నాయని, భూగర్భ జలమట్టం సైతం దిగువకు పడిపోయినందున ఖరీఫ్లో ఆరుతడి పంటలే సాగు చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా స్థానిక రైతులకు సూచించారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పప్పుదినుసులు, మొక్కజొన్న, జొన్న వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాజేంద్రకుమార్, మిషన్ భగీరథ ఈ.ఈ రాకేష్, మోపాల్ తహసిల్దార్ రేఖ, స్థానిక సర్పంచ్ ప్రియాంక తదితరులు ఉన్నారు.

