కలం, వెబ్ డెస్క్: సింగరేణి సంస్థను బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో ఒక వ్యక్తి సంస్థను ఎలా దోచుకున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. 12 ఏళ్ల తరువాత కేటీఆర్కు సింగరేణి సంస్థ సంక్షేమం గుర్తొచ్చిందా.. అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సింగరేణిలో దోపిడీని పూర్తిగా అరికట్టిందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకే బొగ్గు మాయం అనే కల్పిత కథలను అల్లుతున్నారని విమర్శించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. లోడింగ్ నుంచి తూకం వరకు పూర్తి స్థాయి సాంకేతికత వ్యవస్థ అందుబాటులో ఉందని.. బొగ్గు మాయం అనే ప్రశ్నే లేదన్నారు. ప్రతి వాహనం జీపీఎస్ ట్రాకింగ్ జరుగుతుందన్నారు. సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా.. అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టితో ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తూ.. సంస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.
బొగ్గు వేలంలో పాల్గొనలేదు..
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పాల్గొనలేదని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. వారి నిర్వాకంగానే 14 గనులు మూతపడటంతో పాటు ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిందన్నారు. 15 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తిని కోల్పవాల్సి వచ్చిందన్నారు. కానీ, గత రెండేళ్ల కాలంలో నైనీ సహా కొత్త బొగ్గు గనుల అనుమతి సాధించడమే కాకుండా ఉత్పత్తి కూడా ప్రారంభించిందన్నారు.
సింగరేణి సంస్థను ఇతర రాష్ట్రాల్లో విస్తరించడంతో పాటు సోలార్ ఉత్పత్తిలోకి కూడా అడుగు పెడుతోందన్నారు. యూపీఏ–2 హయాంలో తాడిచెర్ల గనికి అనుమతులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. టెండర్ల ప్రక్రియలో తాము ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విధానమే ఇప్పుడు కూడా అమలవుతోందన్నారు. సింగరేణి ఆదాయాన్ని పెంచడం, కార్మికులకు పంచడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు.

