కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ నగరంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Telangana Public School) కల సాకారం అవుతోంది. నిర్మాణం కోసం ప్రభుత్వానికి తాను ప్రతిపాదన పంపడంతో నిధులు మంజూరు చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి గురువారం నగరంలోని కోటగల్లి బాలికల ప్రభుత్వ పాఠశాలను (Kotagalli Girls High School) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… జిల్లాలో రెండు పబ్లిక్ స్కూల్లను ఎంపిక చేశారన్నారు.
ఇందులో భాగంగా అర్బన్ నియోజకవర్గంకు సంబంధించి నగరంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను (Kotagalli Girls High School) ఎంపిక చేయడం జరిగిందన్నారు. తాను గతంలో అనేకసార్లు పాఠశాలను పరిశీలించడం జరిగిందని, ఇక్కడి పరిస్థితిని చూసి పబ్లిక్ స్కూల్ కోసం ప్రతిపాదన పంపడం జరిగిందన్నారు. ఇక్కడ సుమారు 2 వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. అయితే నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేసి, టెండర్లను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే ఖిల్లా రామాలయ అభివృద్ధిలో భాగంగా రోప్ వే కూడా రాబోతుందన్నారు. అలాగే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన విధంగా డివిజన్కు రూ.20 లక్షల పనులు ప్రారంభమవుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, బీజేపీ కార్పొరేటర్లు ప్రసన్న శ్యామల సత్యపాల్, నాగోల్ల లక్ష్మీనారాయణ, చింతకాయల రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.
Also Read : రాహుల్ గాంధీపై సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం
Follow Us On: Instagram

