కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అవినీతి వల్లే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు గోదావరిఖనిలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. కరెంట్ పోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ దిగిపోయేనాటికి సింగరేణి బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు అయితే.. కాంగ్రెస్ హయాంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి 58 మిలియన్ టన్నులు మాత్రమేనని అన్నారు.
సింగరేణిలో ఇప్పుడు పరిస్థితి అవినీతి రైజింగ్.. ఉత్పత్తి ఫాలింగ్ విధంగా ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి కారణం కార్మికులు కాదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సైట్ విజన్ అనే కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. ‘కోల్’ మాల్.. గోల్ మాల్ చేస్తున్నది ఎవరు? సింగరేణిని అవినీతి గనిగా మారుస్తున్నది ఎవరు? అంటూ రేవంత్ సర్కార్ను నిలదీశారు.

