కలం, వెబ్ డెస్క్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియం వేదికగా బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం “సింగరేణి కార్మిక గర్జన” (Singareni Garjana) పేరిట భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానున్న ఈ మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందంటూ, బొగ్గు గని కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
ఈ బహిరంగ సభకు రామగుండం, మంథని నియోజకవర్గాలతో పాటు మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల నుంచి దాదాపు 30 వేల మంది కార్మికులు, నాయకులు భారీగా తరలివస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సొంతింటి కల, లాభాల వాటా పంపిణీ వంటి అంశాలపై కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఈ సభ వేదికగా బీఆర్ఎస్ తన పోరాట కార్యాచరణను ప్రకటించనుంది.

