కలం, రంగారెడ్డి బ్యూరో: దేశంలోనే రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఖరీదైనదిగా పేరొందింది. జిల్లాలో ప్రభుత్వాధికారులు విధుల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా పోటీలు పడుతుంటారు. పోస్టింగులకు జోరుగా పైరవీలు చేస్తుంటారు. రూ. కోట్లలో ముడుపులు కూడా ముట్టజెపుతుంటారు. నచ్చిన చోట జాయిన్ అవుతుంటారు. ఆ తర్వాత ఏంటంటే.. అక్రమార్జనే ధ్యేయంగా పోటీ పడుతుంటారు. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగుల నుంచి మండల స్థాయి అధికారులు, సిబ్బంది వరకు విచ్చలవిడిగా అవినీతికి తెగబడుతుంటారు.
చివరకు ఏసీబీ దాడుల్లో పట్టుబడినా కానీ అదరరు.. బెదరరు! జిల్లాలో ప్రభుత్వ భూములు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, రెవెన్యూ వ్యవహారాలకు ఉన్న ప్రాధాన్యం కొందరు అవినీతి అధికారులకు వరంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూముల విలువ కోట్ల రూపాయల్లో పలికే ప్రాంతం కావడంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, మున్సిపల్ విభాగాల్లోని కొన్ని పోస్టులకు భారీ డిమాండ్ ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా పలు శాఖల్లో అధికారుల అక్రమ సంపాదనకు రంగారెడ్డి జిల్లా అద్దం పడుతుంది.
జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన కొన్ని ఘటనలు..
ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వర్ణ కుమారి ఒక ఫిజియోథెరపీ సెంటర్ కు అనుమతి ఇచ్చేందుకు రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసిబీకి చిక్కారు. గతంలో అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి సహా సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి 14 గుంటల భూమికి పట్టాబుక్ జారీకి గుర్రంగూడకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ 2024 ఆగస్టు 12న ఏసీబీకి పట్టుబడ్డారు. పాసుబుక్ లో జెండర్ సవరణకు డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఆమనగల్లు తహసీల్దార్ లలిత సహా సర్వేయర్ రవిపై కేసు నమోదైంది.
తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున, వీఆర్ఏ యాదగిరి భూమి పేరు మార్పిడికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్పిడి కోసం రూ.9 లక్షలు లంచంగా తీసుకుంటూ కేశంపేట తహసీల్దార్ లావణ్య సహా వీఆర్ ఓ అనంతయ్య పట్టుబడ్డారు. ఓ ఇంటి స్థలం వాల్యూయేషన్, నోడ్యూస్ సర్టిఫికెట్ జారీకి రూ.30 వేలు లంచం తీసుకుంటూ గత మే 5న తలకొండపల్లి మండలం వెల్టాల కార్యదర్శి శరత్ కుమార్ చిక్కారు. ఆదిభట్లలోని ఏడు గుంటల భూమికి పాసుబుక్ ఇచ్చేందుకు రూ.12 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీసులోని రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జి. కృష్ణ అరెస్ట్ అయ్యారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై సర్వే లాండ్స్ అధికారి శ్రీనివాసులుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈయన ఏకంగా రూ. వంద కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చింది. తుర్కయంజాల్ పరిధిలో 200 గజాల గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్కు రూ.70 వేలు లంచంగా తీసుకుంటూ వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు సీబీఎస్ఈ స్కూలుకు ఎన్ఎసీ జారీ చేసేందుకు డీఈఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ జి.శ్రీధర్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ గత ఫిబ్రవరి 15న దొరికారు.
విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభుదాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గత ఏడాది ఏసీబీకి పట్టుబడ్డారు. మీర్ పేట పోలీసు స్టేషన్ లో ఓ బాధితుడి నుంచి వైన్ బాటిళ్లు డిమాండ్ చేసిన కేసులో ఇద్దరు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. బడంగ్ పేటలో ఏకంగా కమిషనర్ సహా పది మంది ఉద్యోగులపై జీహెచ్ఎంసీ కమిషనర్ వేటు వేశారు. బఫర్ జోన్లలో నిర్మాణాలకు ఎన్సీ జారీకి రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో జిల్లా నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ సహా ఏఈ కె.కార్తీక్, ఎస్ఈ ఆఫీసులోని ఏడబ్ల్యూ సెక్షన్ ఏఈ హెచ్. నికేశ్ కుమార్, గండిపేట మండల సర్వేయర్ పి.గణేశ్ ఏసీబీకి చిక్కారు. యాచారం తహసీల్దార్ గా పని చేసిన సుచరిత ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఇటీవల జైలుకు వెళ్లారు.
తాజాగా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ ఆఫీసులో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దేశాని శ్రీనివాసరెడ్డి ఇళ్లు సహా ఆఫీసులోనూ ఏసీబీ సోదాలు చేసింది. ఇప్పటికే ఆయన ఓసారి ఏసీబీకి పట్టుబడ్డారు. బాలాపూర్, శంషాబాద్ తహసీల్దార్ గా పని చేసిన సమయంలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు, ప్రభుత్వ, అసైన్డ్, యూఎల్సీ భూముల అన్యాక్రాంతానికి పరోక్షంగా సహకరించి, రియల్టర్లు, కబ్జాదారుల నుంచి భారీగా లబ్ధి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.
తహసీల్దార్పై పెట్రోల్ పోసి తగులబెట్టినా కానీ..
కొన్నేళ్ల కింద అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోలు పోసి తగులబెట్టిన ఘటన తర్వాత కూడా కొందరు అధికారులు జంకడం లేదు. తాజాగా ఇదే మండల తహసీల్దారు సుదర్శన్ రెడ్డి అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి దొరికారు. 10 ఎకరాల భూమి సర్వే అప్రూవల్కు రూ.20 లక్షల లంచం డబ్బులు తీసుకుంటూ ఆయన సహ సర్వేయర్ ఏసీబీకి చిక్కడం గమనార్హం. గతంలో జరిగిన విషాద ఘటనలు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, భూ వ్యవహారాల పరిష్కారంలో జవాబుదారీతనం ఎంత అవసరమో గుర్తుచేస్తోంది.
గ్రీవెన్స్ ఫిర్యాదులపై తీవ్ర నిర్లక్ష్యం
ప్రజలు గ్రీవెన్స్ కు పలుసార్లు వచ్చి ఫిర్యాదులు ఇస్తే..వాటి పరిష్కారంపై మాత్రం పూర్తి నిర్లక్ష్యమే కనిపిస్తుంది. అక్రమ సంపాదనపైనే అధికారులు మోజు చూపుతుంటారని ప్రజల నుంచి విమర్శలు లేకపోలేదు. గత సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ జిల్లా అధికారుల మీద సీరియస్ కావడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు తమ పని సకాలంలో పూర్తవుతుందో లేదోననే ఆందోళన ఒకవైపు.. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఫైళ్లు ముందుకు కదలవనే భయం మరోవైపు వెంటాడుతున్నాయనే విమర్శలున్నాయి.
భూమికి సంబంధించిన రికార్డుల్లో చిన్న సవరణ చేయించుకోవాలన్నా, పట్టాదారు పాస్బుక్ పొందాలన్నా, ఇంటి స్థలానికి అవసరమైన ధ్రువపత్రాలు తీసుకోవాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం ప్రభుత్వ ఆఫీసుల్లో పనితీరును పట్టి చూపుతోంది. ఏసీబీ దాడులు, కేసుల నమోదు అవినీతిని వెలుగులోకి తీసుకురావడంలో కీలకమైనప్పటికీ, దీర్ఘకాలిక మార్పు రావాలంటే మరిన్ని చర్యలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి గడువుల అమలు వంటి అంశాలపై ఉన్నాతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

