మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. బీసీ సంఘాల ఆందోళన

కలం, మెదక్ బ్యూరో : పట్టణంలో తెల్లవారుజామున చాకలి ఐలమ్మ విగ్రహం (Chakali Ilamma statue) ధ్వంసం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న చిన్న శంకరంపేట మండలం అంబాజీపేటలో రజక సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ .. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు.

సమాజం గర్వించదగిన పోరాట యోధురాలి విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా విరామింపజేశారు. పోలీసులు సీఐ మహేష్ ఆధ్వర్యంలో ఘటనాస్థలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులు శాంతియుతంగా వ్యవహరించాలని సీఐ సూచించారు.

ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. విగ్రహం ధ్వంసంపై రజక సంఘం నాయకులు పోలీసుల భద్రతా ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విగ్రహం వద్ద సీసీ కెమెరాలు సరైన కోణంలో లేకపోవడం, ఉన్న కెమెరాల్లోనూ నిందితులను స్పష్టంగా గుర్తించే అవకాశం లేకపోవడంపై ఆగ్రహం తెలిపారు.

ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ, ఆమె విగ్రహానికి తగిన రక్షణ కల్పించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని నిరసనకారులకు మద్దతు తెలిపారు. అనంతరం రజక సంఘం ఆధ్వర్యంలో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో అంబాజీపేట రజక సంఘం నాయకులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>