కలం, వెబ్ డెస్క్ : దసరా, దీపావళి పండుగల వేళ ప్రజలపై రూ.5,420 కోట్ల విద్యుత్ భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరువు, ఎల్ నినో ప్రభావం, నిత్యావసరాల ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజల నడ్డి విరిచేలా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఉద్యమం నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రూపుదిద్దుకుందని హరీష్ రావు గుర్తుచేశారు. 2000 ఆగస్టు 28న విద్యుత్ పోరాటంలో రైతులపై జరిగిన కాల్పుల సంఘటన కేసీఆర్‌ను కలచివేసిందని, తెలంగాణ రైతాంగం మేలు కోసం, ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడం కోసం కేసీఆర్ తన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరెంటు వ్యవస్థకు గ్రహణం పట్టిందని, అవకాశమున్నా సాకులు చెబుతూ రైతులకు నీళ్లు ఇవ్వకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.

