కలం, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కిర్లంపూడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జులై 16న చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి విచారణ నిమిత్తం ఈ నెల 8న పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జులై 16న ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన సమయంలో అంబటి రాంబాబు అక్కడికి వెళ్లారు.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల (Mudragada Padmanabham Funeral) కార్యక్రమాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని అడ్డుకుని నెట్టివేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసు విచారణలో భాగంగానే అంబటి రాంబాబుకు తాజాగా నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని పోలీసులు సూచించగా, ఆ రోజు తనకు ఇతర పనులు ఉన్నాయని అంబటి పోలీసులకు తెలిపారు. విచారణకు తాను ఎప్పుడు హాజరవుతాననే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, అంబటి రాంబాబు వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన విచారణకు హాజరయ్యే తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

