కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంటే, మరోవైపు ఉన్న పవర్ ప్లాంట్లు వరుసగా పడకేస్తుండటం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ధ్వజమెత్తారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (BTPS)లోని మూడో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ తీరును ఎండగట్టారు.
రాష్ట్రంలో ప్రజలకు, వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన సమయంలో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడం ఆందోళన కలిగిస్తోందని పువ్వాడ పేర్కొన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా బీటీపీఎస్ మూడో యూనిట్ నిలిచిపోవడంతో రోజూ 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందని తెలిపారు. దీనిఫలితంగా ఇప్పటివరకు సుమారు 15.5 కోట్ల యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
విద్యుత్ ప్లాంట్లలో క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన ముందస్తు సాంకేతిక తనిఖీలు, అవసరమైన కీలక స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే పవర్ స్టేషన్లలో వరుసగా సమస్యలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రమత్తు వదిలి, నిలిచిపోయిన మూడో యూనిట్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని, ఈ సమస్యపై తక్షణమే చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

