కలం, స్పోర్ట్స్ : వెస్టిండీస్ భారత్‌కు భారీ షాక్ ఇచ్చింది. 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయానికి షై హోప్ (Shai Hope ) అజేయ 162 పరుగుల ఇన్నింగ్స్ ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో వన్డేల్లో వెస్టిండీస్ అత్యధిక విజయవంతమైన ఛేజ్‌ను నమోదు చేసింది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన వెస్టిండీస్ కెప్టెన్ షై హోప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివరి వన్డేలో తన ఆటతీరుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాటలే కారణమని చెప్పాడు. “చేజింగ్ అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. భారత్‌లో డ్యూ ఉండటంతో అది మరింత సులభమవుతుంది. సిరీస్‌ను విజయంతో ముగించాలని భావించాం. అది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పాడు.
అంతేకాకుండా ‘‘గ్రోయిన్ ప్రాంతంలో కొంత అసౌకర్యం అనిపించింది. అయినా చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాను. మేం ఒక బ్యాటర్‌ను కోల్పోయాం.. పరిస్థితులు మరింత కఠినంగా మారాయి. అప్పుడు ఎంఎస్ ధోనీతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. ’నువ్వు అనుకునేదానికంటే నీకు ఎక్కువ సమయం ఉంటుంది’ అని ఆయన చెప్పారు. అందుకే ఛేజ్‌ను చిన్న చిన్న దశలుగా విభజించుకుని ఆడాం. ఓవర్‌రేట్ పెనాల్టీ కారణంగా భారత్ అదనపు ఫీల్డర్లను సర్కిల్‌లోకి తీసుకురావాల్సి ఉంటుందని తెలుసు. అందుకే ఓపికగా ఆడాను. సిరీస్‌లో కొన్ని దశల్లో మేం అద్భుతమైన క్రికెట్ ఆడాం. బ్యాటర్లు చాలా స్థిరంగా రాణించారు. బౌలింగ్‌లో మాత్రం ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. టీ20లకు రెండు రోజుల సమయం ఉంది. అప్పటికి పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నాను.” అని వివరించాడు.

