కట్టుకాచారంలో చెక్‌డ్యామ్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పక్షపాతం లేకుండా పేదలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని, ‘ఇందిరమ్మ ఇల్లు’ అనేది అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి చెందాల్సిన హక్కని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా, ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే అర్హులైన పేద కుటుంబాలకు కూడా ఇళ్లను అందిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం నేలకొండపల్లి మండలంలోని కట్టుకాచారం గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాలేరు వాగుపై రూ.6.65 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించడంతో పాటు కట్టుకాచారం పీపీవీ నుంచి బట్టుకుంటవాగు వరకు రూ.2.50 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 35 నెలల స్వల్ప కాలంలోనే కట్టుకాచారం గ్రామంలో రూ.13.50 కోట్లతో సమగ్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేశామని వెల్లడించారు. గ్రామ అంతర్గత రహదారులు, విద్యుత్ లైన్ల మార్పిడి, తాగునీరు, అంగన్‌వాడీ భవనం మరియు వివిధ రహదారుల నిర్మాణం కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితులు నెలకొని నీటి కొరత ఏర్పడుతున్న వేళ కట్టుకాచారంలో చెక్‌డ్యామ్ (Kattukacharam Check Dam) పూర్తవడం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని, తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇళ్లలో ఇప్పటికే 2.25 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలోనే రెండో విడత ఇళ్లను కూడా వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. రూ.6.65 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన చెక్‌డ్యామ్‌ను యంత్రాంగం కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పూర్తి చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 250 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా, కరవు వేళ గ్రామ పరిసరాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని వివరించారు.

అనంతరం నేలకొండపల్లి మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>