కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు గత 50 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రహమతుల్లా(Dr Rahamathullah)కు జాతీయ అవార్డుకు ఎంపిక కావడం నిజంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ప్రజలకు గర్వకారణం అంటూ పలువురు జిల్లా వాసులు అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ పరిసర ప్రాంతాలలో గత 50 సంవత్సరాలుగా వైద్య వృత్తి లో ఉంటూ గ్రామీణ ప్రాంత ప్రజలకు, పేద ప్రజలకు ఆరోగ్య, వైద్య సేవలు అందించి వేలాదిమందికి ప్రాణప్రదాతగా నిలిచిన డాక్టర్ మహమ్మద్ రహతుల్లా సూపర్ సీనియర్ జనరల్ ఫిజీషియన్ గా 2026 సంవత్సరానికి గాను డాక్టర్ బి.వి పట్టాభిరామ్ స్మారక జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం ఏ కరీం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి లోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 8వ తేదీన జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేస్తున్నట్టు డాక్టర్ కరీం తెలిపారు. వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించి గ్రామీణ పేద ప్రజలకు అండగా నిలిచి ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చిదిద్దడంలో డాక్టర్ రహతుల్లా చేసిన కృషికి గాను ఆయన సేవలకు జాతీయ పురస్కారం లభించడం జిల్లాకే గర్వకారణం అని పలువురు అభిప్రాయపడ్డారు.

