కలం, స్పోర్ట్స్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ శివాలెత్తించాడు. ప్రతి బంతిని బౌండ్రీ దాటిస్తూ డబుల్ సెంచరీతో వీరవిహారం చేశాడు. భారత ఓపెనర్లు ఇద్దరే టార్గెట్‌లో 50శాతం స్కోర్‌ను చేసేశారు. రోహిత్, గిల్ ఇద్దరూ తొలి బంతి నుంచే ఉతకడం స్కార్ట్ చేశారు. రోహిత్ సెంచరీతో అదరగొడితే.. గిల్ డబుల్ సెంచరీలో చితక్కొట్టాడు. దీంతో వెస్టిండీస్ ఇచ్చిన 406 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్ల నష్టానికే ఛేదించి 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్ బ్యాటర్లలో ఆమిర్ జంగూ 77 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో అత్యధికంగా 114 పరుగులు చేయగా, కెప్టెన్ షాయ్ హోప్ 94 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు, జాన్ క్యాంప్‌బెల్ 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి సెంచరీలతో రాణించారు. ఇతర బ్యాటర్లలో రోస్టన్ చేజ్ 29నాటౌట్, షమార్ జోసెఫ్ 14, కీసీ కార్టీ 9, అల్జారీ జోసెఫ్ 8, కీమో పాల్ 3 పరుగులు చేశారు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ సున్నా (0) పరుగులకే నిష్క్రమించాడు.
ఇక భారత బౌలింగ్ విషయానికి వస్తే.. గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో 96 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకోగా, రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 65 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ 5 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఔకిబ్ నబీ (8.5 ఓవర్లలో 84 పరుగులు), నమన్ ధీర్ (6.1 ఓవర్లలో 38 పరుగులు) బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు పడగొట్టలేకపోయారు.
406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి బంతి నుంచి బాదడం షురూ చేసింది. ఎంతలా అంటే ఓపెనర్లు ఇద్దరే తొలి వికెట్‌కు 255 పరుగులు చేశారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ వీరవిహారం చేశారు. రోహిత్ శర్మ 75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. భారత స్కోర్ 255కు చేరినప్పుడు సీల్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూలో రోహిత్ వికెట్ కోల్పోయాడు. రోహిత్ వికెట్‌తో క్రీజులోకి రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ 19 బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు చేసి జోసెఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. స్కోర్‌ను ఎక్కడా స్లో కానివ్వలేదు. పక్కా వన్డే ఆడుతూ గిల్‌కు చక్కటి పార్ట్‌నర్‌షిప్‌ను అందించాడు. అయితే ఓపెనర్‌గా వచ్చిన గిల్ మాత్రం మ్యాచ్ ఆఖరి వరకు ఉన్నాడు. 133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్సర్లతో 223 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో భారత్ 406 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్ల నష్టానికే ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది.

