కలం, కరీంనగర్: కరీంనగర్ అర్బన్ పరిధిలో నివసిస్తున్న మాష్టీన్ కుల కుటుంబాలకు తక్షణమే కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ మాష్టీన్ కుల జాతీయ అధ్యక్షులు నాగిళ్ల గోపి ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బాధితులు, కుల ప్రతినిధులు శాంతియుతంగా నిరసన నిర్వహించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు, ఎస్సీ అభివృద్ధి అధికారికి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా నాగిళ్ల గోపి, కుల ప్రతినిధులు మాట్లాడుతూ.. మాష్టీన్ కులం షెడ్యూల్డ్ కులాల (SC) జాబితాలో సీరియల్ నంబర్ 12, గ్రూప్–II పరిధిలో ఉన్నప్పటికీ, కరీంనగర్ అర్బన్ పరిధిలో నివసిస్తున్న 100కు పైగా కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలకు పైగా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు ఎటువంటి స్పష్టమైన స్పందన ఇవ్వకుండా దరఖాస్తులను పెండింగ్‌లోనే ఉంచారని పేర్కొన్నారు.
కూలి పనుల వైపు మొగ్గుతున్న విద్యార్థులు
కుల ధృవీకరణ పత్రాలు జారీ కాకపోవడంతో పేద మాష్టీన్ (Mashteen Community) కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య అభ్యసించాల్సిన విద్యార్థులు సర్టిఫికెట్లు లేక చదువులను మధ్యలోనే ఆపేసి, అనివార్యంగా కూలి పనులకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. ఇది వారి భవిష్యత్తును, విద్యా అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని మాష్టీన్ కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని, చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన ప్రతి మాష్టీన్ కుటుంబానికి కుల ధృవీకరణ పత్రాలను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు.
సర్టిఫికెట్లు అందక విద్యార్థుల చదువులు ఆగిపోయే పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిరసన తెలపడానికి వచ్చిన ప్రతినిధులతో మాట్లాడిన జిల్లా అధికారులు సమస్య తీవ్రతను పరిశీలించి, చట్ట ప్రకారం అర్హులైన వారికి వీలైనంత త్వరగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాష్టీన్ కుల జాతీయ అధ్యక్షులు నాగిళ్ల గోపి, రాష్ట్ర అధ్యక్షులు బుద్దుల మోహన్ రావు, నాయకులు నాగిళ్ల నాగరాజు, మన్నం శరత్ బాబు, ఒరుగంటి అరుణ్, ఏటికల వెంకటేశ్వరరావు, మన్నం మురాజి, ఒరుగంటి మరియాదాసు, నాగిళ్ల శీను, ఏటికల శీను, ఒరుగంటి బాబురావు, ఒరుగంటి ఆనంద్, ఏటికల వెంకన్న, నాగిళ్ల రుక్మిణి, ఒరుగంటి సుకన్య, మాధవరపు రవి జ్యోతి, అరుణ యేలమందరావు, నాగమణి, జయ రాజుతో పాటు 100కు పైగా కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

