కలం, నల్లగొండ: పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని ‘మన తెలంగాణ ఫార్మర్స్ ఫెడ్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్’ ఛైర్మన్ నంద్యాల నర్సింహారెడ్డి (Nandyala Narsimha Reddy) పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నేషనల్ ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘాలు చేపడుతున్న ఆందోళనలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దిగుమతి సుంకం తగ్గించడం వలన విదేశీ పామాయిల్ చౌకగా దేశీయ మార్కెట్లోకి వచ్చి చేరుతుందని, ఇది దేశీయ ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. వంటనూనెల రంగానికి ఈ తిరోగమన నిర్ణయం పెద్ద విఘాతమని అన్నారు.
మద్దతు ధర.. మార్కెట్ రక్షణ లేదు..
నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సాగు వ్యయం గణనీయంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో దిగుమతిదారులకు అనుకూలంగా ఉండటం, దేశీయ రైతులకు తగిన మద్దతు ధర, మార్కెట్ రక్షణ కల్పించకపోవడం విచారకరమన్నారు. 2019-20లో ముడి పామాయిల్, శుద్ధి చేసిన పామాయిల్ మధ్య దిగుమతి సుంక వ్యత్యాసం 7.5 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 19.25 శాతానికి పెరిగిందన్నారు. ఇది విదేశీ పోటీకి దేశీయ రైతులను వదిలేయడమేనని విమర్శించారు. పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 2021-22 స్థాయిలో ఉన్న 49 శాతానికి తక్షణమే పెంచాలన్నారు.
పెరిగిన సాగు వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ కనీస మద్దతు ధరను టన్నుకు రూ. 25వేలకు పెంచాలని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. విదేశీ నూనెల పోటీ నుంచి దేశీయ ఆయిల్ పామ్ రైతులను, వంటనూనెల ఉత్పత్తి రంగాన్ని కాపాడేలా దీర్ఘకాలిక రక్షణ విధానాలను రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, దిగుమతి సుంకాన్ని తక్షణమే 49 శాతానికి పెంచి ఆయిల్ పామ్ రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

