కలం, వెబ్ డెస్క్: సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ సచివాలయ ఉద్యోగులు (AP Secretariat Employees) తలపెట్టిన ధర్నా ముగిసింది. 11 గంటల పాటు విజయవాడ నగరంలో ధర్నా చేపట్టారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే వదిలిపెట్టాలని.. ఎవరిపై కేసులు నమోదు చేయొద్దని డిమాండ్ చేశారు. ధర్నా చేసేందుకు శనివారం రాత్రే వివిధ జిల్లాల నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఉదయం నుంచి నిరసనలు చేస్తుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. విరమించేందుకు ప్రయత్నం చేసినా.. ఆందోళనలు కొనసాగించేందుకే మొగ్గు చూపారు. ఇదే సమయంలో.. వారికి ఊరట కల్పిస్తూ సచివాలయాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు పురపాలక మంత్రి నారాయణ పదోన్నతులు కల్పించబోతున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా..
వేతనాలు, పని భారం సహా పలు సమస్యలను పరిష్కరించాలంటూ కొంతకాలంగా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి పలుమార్లు మొర పెట్టుకుంటున్నారు. సరైన స్పందన లేకపోవడంతోనే తాము ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని పలువురు ఉద్యోగులు వాపోయారు. వాలంటీర్ల వ్యవస్థను తొలగించాక, తమపై పనిభారం మరింత పెరిగిందన్నారు. ఇంత చేసినా.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్ల కాలంలో సుమారు వంద మందికి పైగా సచివాలయ ఉద్యోగులు చనిపోయారని వాపోయారు. న్యాయమైన హక్కుల గురించి అడిగితే.. యూనియన్ నేతలను రాత్రికి రాత్రే సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవాలని కోరారు.

