రామగుండంలో డబ్ల్యూజేఐ ప్రెస్ క్లబ్ ప్రారంభం

కలం, రామగుండం: రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఫలితంగా ఆకస్మిక మరణాల ఘటనలు పెరుగుతున్నాయని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (Working Journalist of India) రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam), అంతర్గాం ప్రెస్ క్లబ్‌లను యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతులను ప్రభుత్వం అధ్యయనం చేసి, వారి సంక్షేమానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పాత్రికేయ రంగంలో పెరిగిన పోటీ, యాజమాన్యాల ఒత్తిళ్లు జర్నలిస్టుల వృత్తిని తీవ్ర ఒత్తిడితో కూడినదిగా మార్చాయని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు యాజమాన్యాల నుంచి సరైన వేతనాలు అందకపోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో అధిక శాతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ విధానాలు మారడం వల్ల జర్నలిస్టులకు సంబంధించిన నివేశన స్థలాలు, జీవిత బీమా వంటి అంశాలపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. కేవలం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడంతో ప్రభుత్వం తన బాధ్యత పూర్తయినట్లు భావించకూడదని, జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలు నిర్దిష్ట పద్ధతిలో అమలయ్యేలా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కరుణాకర్ కోరారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అనుబంధంగా రామగుండం, అంతర్గాం ప్రాంతాల్లో ప్రెస్ క్లబ్‌ల ఏర్పాటుకు స్థానిక పాత్రికేయులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్‌ల ఏర్పాటుకు కృషి చేసిన పంజాల రాధాస్వామిగౌడ్‌ను అభినందించారు. త్వరలో గోదావరిఖని కేంద్రంలోనూ డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నిరంతరం కృషి చేస్తుందని కరుణాకర్ హామీ ఇచ్చారు. సభ్యుల సంఖ్యను ప్రామాణికంగా చూపుతూ వ్యక్తిగత ప్రయోజనాలకు పరిమితమయ్యే నాయకత్వాలకు భిన్నంగా డబ్ల్యూజేఐ పనిచేస్తుందని తెలిపారు.

జర్నలిస్టులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పంజాల రాధాస్వామిగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంతర్గాం సర్పంచి ఆంబోతు రవికుమార్, గోలివాడ సర్పంచి కొలిపాక చంద్రారెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పూదరి సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగం కిరణ్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>