మారనున్న ఉమ్మడి ఖమ్మం రైల్వే ముఖచిత్రం..!

కలం, ఖమ్మం బ్యూరో : ​ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజల చిరకాల స్వప్నానికి ఎట్టకేలకు మోక్షం లభించే సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాసిన లేఖకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించడం, ఆదివారం నేరుగా ఫోన్ చేసి పెండింగ్ ప్రాజెక్టుల (Bhadrachalam Railway Line Project)పై స్పష్టమైన అభయమివ్వడం ఖమ్మం గడ్డపై సరికొత్త ఆశలకు ప్రాణం పోస్తుంది. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన రైల్వే కలలకు ఇప్పుడు ఊపిరి పోస్తూ, ఈ ప్రాంత ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చే దిశగా పట్టాలు కదులుతున్నాయి.

​దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి దేశవ్యాప్తంగా నిత్యం ప్రవాహమై వచ్చే భక్తుల కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి. ఇన్నాళ్లూ నేరుగా రైలు వసతి లేక పడుతున్న ప్రయాణ ఇబ్బందులకు చెక్ పెడుతూ, పాండురంగాపురం–సాకేతపురి (సారపాక) రైల్వే లైన్ పనులను తక్షణమే ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రగిరి రాముని క్షేత్రం వరకు రైలు కూత మోగబోతుండటంతో ఆధ్యాత్మిక పర్యాటకం ఊపందుకోవడమే కాక, స్థానిక వ్యాపార రంగానికి సరికొత్త పారిశ్రామిక కాంతి చేకూరనుంది.

​మరోవైపు, ఈ రైల్వే లైన్లు కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాకుండా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బలమైన ఆర్థిక, వాణిజ్య వారధిగా నిలవబోతున్నాయి. గత బడ్జెట్‌లో ప్రకటించినా నిధుల లేమితో నిలిచిపోయిన సత్తుపల్లి–కొవ్వూరు మార్గానికి నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పూర్తయిన కొత్తగూడెం–సత్తుపల్లి లైన్‌కు ఇది కొనసాగింపుగా మారితే, కోస్తాంధ్ర దిశగా బొగ్గు రవాణాతో పాటు ఇతర వాణిజ్య రవాణా మునుపెన్నడూ లేనంత వేగవంతం కానుంది.

​దీనికి తోడు పెనుబల్లి నుంచి అమరావతి సమీపంలోని కొండపల్లి వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గం రెండు రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల మధ్య దూర భారాన్ని తగ్గిస్తూ విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. ఖమ్మం, భద్రాద్రి ప్రాంతాల రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు, వ్యాపారుల సరుకులకు అమరావతి వైపు సరికొత్త మార్కెట్ తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక అధ్యయన బృందాలను పంపుతామని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడం పనుల వేగానికి అద్దం పడుతోంది. కేంద్రం ఇచ్చే ఈ ఆర్థిక, సాంకేతిక ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం ప్రాంతం రెండు రాష్ట్రాల వ్యాపార శకంలో ఒక వ్యూహాత్మక రైల్వే జంక్షన్‌గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోందనీ జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>