కలం, సినిమా : బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ (Deepika – Ranveer) ఇంట మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ స్టార్ కపుల్స్ కు రెండో కుమార్తె జన్మించింది. ఈ మేరకు తాము రెండోసారి ఆడబిడ్డకు తల్లిదండ్రులమయ్యామని వారు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘వెల్కమ్ బేబీ గర్ల్’ అంటూ వారు షేర్ చేసిన స్పెషల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు అభిమానులు ఈ దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
రీల్ లైఫ్ ప్రేమ.. రియల్ లైఫ్ బంధంగా..
దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ మధ్య ప్రేమ ప్రయాణం 2013లో వచ్చిన ‘గొలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా’ సినిమా సెట్స్‌లోనే మొదలైంది. కలసి నటిస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రగాఢమైన ప్రేమగా మారింది. ఆ తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఐదేళ్ల డేటింగ్ అనంతరం, 2018లో ఇటలీలోని లేక్ కోమో వేదికగా ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన ఆరేళ్ల తర్వాత, అంటే 2024 సెప్టెంబర్ 8న ఈ దంపతులకు తొలి సంతానంగా కుమార్తె జన్మించింది. ఆమెకు ‘దువా పదుకొణె సింగ్’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండు కుమార్తె రాకతో దీపికా , రణవీర్ సింగ్ దంపతుల కుటుంబంలో ఆనందం రెట్టింపైంది.

