​అవమానాలను దాటి, ఆరోగ్యం వైపు.. ఖమ్మంలో ట్రాన్స్‌జెండర్ హెల్త్ సెంటర్

కలం, ఖమ్మం బ్యూరో: సమాజంలో హేళనలు, వివక్ష, ఆదరణకు నోచుకోలేని ట్రాన్స్ జెండర్ల (Transgender) జీవితాల్లో ఖమ్మం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కొత్త వెలుగులు నింపుతోంది. సమాజం చూపే వివక్షను దాటుకుని ఆరోగ్యవంతంగా జీవించేలా ఇక్కడి మానసిక వైద్య విభాగం వారికి కొండంత అభయాన్ని అందిస్తోంది. ​ట్రాన్స్ జెండర్లు ఆసుపత్రికి రావడానికి పడే సంకోచాన్ని, భయాన్ని పోగొట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రతి గురువారం ఆసుపత్రిలో ‘ప్రత్యేక ఓపీ’ సేవలు అందుబాటులోకి తెచ్చారు.

విశిష్ట సేవలు

ఎలాంటి వివక్ష లేకుండా నిపుణులైన వైద్యులతో రహస్యంగా కౌన్సెలింగ్, వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ ప్రత్యేక క్లినిక్‌కు ప్రతినెలా సగటున 5 కేసులు వస్తుండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 26 మధ్యకాలంలో 9 మంది ట్రాన్స్ జెండర్లు ఈ విభాగాన్ని ఆశ్రయించి మానసిక ప్రశాంతతను సాధించారు. ​జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ప్రత్యేక పర్యవేక్షణలో నడుస్తున్న ఈ విభాగం, కేవలం ట్రాన్స్ జెండర్లకే కాక సమాజంలోని అనేక వర్గాలకు విశిష్ట సేవలందిస్తోంది.

అనేక సమస్యలకు చికిత్సలు

మాతా-శిశు ఆరోగ్యం నుంచి వృద్ధాప్య సమస్యల వరకు, అలాగే మద్యం, పొగాకు, గంజాయి లాంటి వ్యసనాల బారినపడిన వారికి కౌన్సెలింగ్, పునరావాసం కల్పిస్తోంది. ప్రతి నెలా దాదాపు 60 మంది వ్యసన విముక్తి పొంది తిరిగి తమ కుటుంబాల వద్దకు చేరుతుండడం విశేషం. మాదకద్రవ్యాల కేసుల్లో చిక్కుకున్నవారికి 8 వారాలపాటు కౌన్సెలింగ్ ఇచ్చి, ‘ర్యాపిడ్ డ్రగ్ ప్యానెల్ టెస్ట్’ నెగెటివ్ వచ్చాక న్యాయస్థానాలకు నివేదికలు పంపుతున్నారు. పోక్సో చట్టం కింద బాధిత చిన్నారుల మానసిక విశ్లేషణతోపాటు జైలు ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం, మానసిక వైద్యం అందిస్తున్నారు.

మెంటల్ హెల్త్‌పై అవేర్‌నెస్

VSMS, IDEAS స్కేల్స్ ఆధారంగా నెలకు 80 నుంచి 100 మందికి వైకల్య శాతాన్ని నిర్ధారించి దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు కూడా మంజూరు చేస్తున్నారు. ​ఈ ఏడాది జనవరి నుండి ఆగస్టు 26 వరకు పరిశీలిస్తే.. 1,809 సాధారణ ఓపీ, 452 డి-ఎడిక్షన్, 67 ఇన్-పేషెంట్, 55 ఫోరెన్సిక్, 52 పోక్సో, 51 ఖైదీల కేసులు, 9 ట్రాన్స్ జెండర్ కేసులకు వైద్యులు పూర్తిస్థాయిలో చికిత్సలు అందించారు. వైద్య సేవలతోపాటు వైద్య విద్యార్థులకు క్లినికల్ శిక్షణ ఇస్తున్నారు. మెంటల్ హెల్త్‌పై ఇప్పటివరకు 20కిపైగా అవగాహన సదస్సులు నిర్వహించారు.

వైద్య సేవలను విస్తరిస్తే..

​ప్రస్తుతం ఈ విభాగంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, డీఆర్పీ-పీజీ వైద్యుడు, నర్సింగ్ సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. పెరిగిన కేసుల నిష్పత్తికి తగ్గట్టుగా సేవలు అందించడంలో కొంత ఆటంకం ఏర్పడుతోంది. ఇతర ప్రాంతాల నుంచి సైకియాట్రిక్ వైద్యులను ఇక్కడికి డెప్యుటేషన్‌పై నియమిస్తే ఈ సమస్య తీరుతుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ప్రత్యేక దృష్టి సారించి, ఖమ్మం సర్వజన ఆసుపత్రిలోని మానసిక వైద్య విభాగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>