క్రిమినల్ చట్టాల్లో డిజిటలైజేషన్ ఆధారాలే కీలకం : శివకుమార్

కలం, కరీంనగర్ బ్యూరో : నూతన క్రిమినల్ చట్టాల అమలు నేపథ్యంలో డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ ఆధారాల నిర్వహణ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని కరీంనగర్ (Karimnagar) ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఎస్. శివకుమార్ స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ‘అస్త్ర కన్వెన్షన్’ హాలులో నిర్వహించిన న్యాయ-పోలీసు అధికారుల ఉమ్మడి సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ… ఇంటర్-ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) ద్వారా ‘వన్ డేటా – వన్ ఎంట్రీ’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ-ఎఫ్‌ఐఆర్, ఈ-చార్జ్‌షీట్‌ల సమర్పణ, డిజిటల్ సమన్లు, వర్చువల్ మోడ్‌లో సాక్షుల విచారణ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని విచారణలో పారదర్శకత పెంచాలని కోరారు.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ… న్యాయ-పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే బాధితులకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోర్టు ప్రక్రియల్లో జాప్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ-సమ్మన్స్ పద్ధతిని విస్తృతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

డిజిటల్ విధానాలపై (e-FIR, e-Chargesheet, e-Summons) కోర్టు, పోలీసు సిబ్బందికి అవగాహన సదస్సులు నిర్వహించాలని, దాఖలు ప్రక్రియలో ఆలస్యం లేకుండా అన్ని పని దినాల్లో ఛార్జ్‌షీట్‌లను స్వీకరించడం వంటివి తప్పనిసరి చేయాలన్నారు. తీర్పుల ప్రతులు, సాక్షుల వాంగ్మూలాలను సకాలంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి పర్యవేక్షించాలన్నారు. గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కేసుల పరిధి మార్పు అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా (Karimnagar) న్యాయమూర్తులు, పోలీస్ ఉన్నతాధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>